Source: 
Sakshi.Com
https://www.sakshi.com/telugu-news/national/national-parties-collected-rs-15077-crores-unknown-sources-1481565
Author: 
Date: 
27.08.2022
City: 
New Delhi

జాతీయ పార్టీలు 2004 నుంచి 2021 వరకు వివరాలు వెల్లడించని వ్యక్తులు, సంస్థల నుంచి సుమారు రూ.15,077.97 కోట్లు విరాళాలు అందుకున్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫామ్స్‌-ఏడీఆర్‌ నివేదిక తెలిపింది. అయితే.. ఒక్క 2020-21 ఆర్థిక ఏడాదిలోనే జాతీయ, ప్రాంతీయ పార్టీలు గుర్తు తెలియని వారి నుంచి రూ.690.67 కోట్లు విరాళంగా స్వీకరించినట్లు పేర్కొంది. ఈ నివేదికలో.. బీజేపీ, కాంగ్రెస్‌, టీఎంసీ వంటి ఎనిమిది జాతీయ పార్టీలు, 27 ప్రాంతీయ పార్టీలను పరిగణనలోకి తీసుకుని వివరాలు వెల్లడించింది ఏడీఆర్. 

2004-05 నుంచి 2020-21 వరకు ఎన్నికల సంఘానికి పార్టీలు సమర్పించిన విరాళాలు, ఆదాయపన్ను రిటర్న్‌ల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది ఏడీఆర్‌. ఎలాంటి వివరాలు వెల్లడించని వ్యక్తులు, సంస్థల నుంచి జాతీయ పార్టీలు సుమారు రూ.15,077.97 కోట్లు విరాళంగా అందుకున్నట్లు స్పష్టం చేసింది. ‘2020-21 ఆర్థిక ఏడాదిలో 8 జాతీయ పార్టీలు గుర్తుతెలియని వారి నుంచి రూ.426.74 కోట్లు అందుకోగా.. 27 ప్రాంతీయ పార్టీలు రూ.263.928 కోట్లు విరాళంగా పొందాయి.’అని తెలిపింది ఏడీఆర్‌.

తొలిస్థానంలో కాంగ్రెస్‌..
2020-21లో కాంగ్రెస్‌ పార్టీ రూ.178.782 కోట్లు వివరాలు వెల్లడించని వ్యక్తులు, సంస్థల నుంచి పొందిందని, అది మొత్తం జాతీయ పార్టీలు పొందిన దాంట్లో 41.89 శాతమని తెలిపింది ఏడీఆర్‌. ఇదే అత్యధికమని పేర్కొంది. మరోవైపు.. బీజేపీకి రూ.100.502 కోట్లు అందాయి. అది మొత్తం వివరాలు లేని వారి నుంచి అందిన దాంట్లో 23.55 శాతంగా తెలిపింది. మరోవైపు.. వివరాలు లేని సోర్స్‌ల నుంచి ఎక్కువ మొత్తంలో విరాళాలు అందుకున్న మొదటి ఐదు పార్టీలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ రూ.96.2507 కోట్లు, డీఎంకే రూ.80.02 కోట్లు, బీజేడీ రూ.67 కోట్లు, ఎంఎన్‌ఎస్‌ రూ.5.773 కోట్లు, ఆప్‌ రూ.5.4కోట్లుగా నివేదిక తెలిపింది.

© Association for Democratic Reforms
Privacy And Terms Of Use
Donation Payment Method