Skip to main content
Source
ETV Bharat
https://www.etvbharat.com/te/!bharat/women-candidates-in-first-phase-lok-sabha-polls-2024-only-135-out-of-1618-candidates-are-women-contesting-in-lok-sabha-phase-1-elections-ten24040900874
Author
ETV Bharat Telugu Team
Date

Women Candidates In First Phase LS Polls 2024 : సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి సిద్ధమైంది భారత్. ఈ నేపథ్యంలో దేశానికి ప్రాతినిథ్యం వహించే విషయంలో మహిళల సంఖ్య మరోసారి తెరపైకి వచ్చింది. మొదటి దశ ఎన్నికలల్లో మొత్తం 1618 మంది పోటీ చేస్తుండగా, ఇందులో 135 (8%) మంది మాత్రమే మహిళా అభ్యర్థులు ఉన్నారు.

Women Candidates In First Phase LS Polls 2024 : సార్వత్రిక ఎన్నికల సమరంలో మొదటి దశలో పోటీచేస్తున్న అభ్యర్ధులకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌- ADR ప్రకటించింది. మొత్తం 1,618 మంది అభ్యర్థుల్లో కేవలం 135 మంది మాత్రమే మహిళా అభ్యర్థులు ఉన్నారని ఏడీఆర్​ తెలిపింది. అంతేకాదు బరిలో దిగిన 1618 మందిలో 256 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ప్రకటించింది.

ఆ పార్టీ నేతలపైనే ఎక్కువ కేసులు!
ADR నివేదిక ప్రకారం లోక్‌సభ ఎన్నికల మొదటి దశలో బరిలో నిలిచిన మొత్తం 1618 మంది అభ్యర్థుల్లో 256 మంది అంటే 16 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఏడుగురిపై హత్య కేసులు, 19 మందిపై హత్యాయత్నం, 18 మందిపై మహిళలకు సంబంధించి అలాగే ఇతర తీవ్రమైన నేరాలు నమోదయ్యాయి. మొదటి దశలో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులపైనే ఎక్కువ క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీలు ఉన్నాయి.

తొలి దశలో ఆర్జేడీ ప్రకటించిన నలుగురు అభ్యర్థులపైన కూడా క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. డీఎంకే ప్రకటించిన 22 మంది అభ్యర్థుల్లో 13మందిపై, సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించిన 7మంది అభ్యర్థుల్లో ముగ్గురిపై, ఏఐటీసీ ప్రకటించిన ఐదుగురు అభ్యర్థుల్లో ముగ్గురిపై, భారతీయ జనతా పార్టీ ప్రకటించిన 77 మంది అభ్యర్థుల్లో 28మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. అన్నాడీఎంకే ప్రకటించిన 36 మంది అభ్యర్థుల్లో 13మందిపై, కాంగ్రెస్‌ ప్రకటించిన 56 మంది అభ్యర్థుల్లో 19 మందిపై, బహుజన్‌ సమాజ్‌ పార్టీ ప్రకటించిన 86 మంది అభ్యర్థుల్లో 11 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

రాష్ట్రాలవారీగా ఇలా
క్రిమినల్‌ కేసులు ఎక్కువగా ఉన్న అభ్యర్థులు ఉన్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. తమిళనాడులోని పార్టీలు ప్రకటించిన 945 మంది అభ్యర్థుల్లో 138పై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. తర్వాతి స్థానంలో ఉత్తర్​ప్రదేశ్‌ ఉంది. యూపీలో మొత్తం 88 మంది అభ్యర్థుల్లో 28మందిపై క్రిమినల్‌ కేసులు ఉ‌న్నాయి.

అభ్యర్థుల ఆస్తులు!
లోక్‌సభ ఎన్నికల మొదటి దశలో బరిలో నిలిచిన మొత్తం 1618 మంది అభ్యర్థుల్లో 193 మంది ఆస్తులు రూ.ఐదు కోట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. 139 మంది అభ్యర్థుల వద్ద రూ.2 నుంచి రూ.5 కోట్ల సంపద ఉంది. 277 మంది అభ్యర్థుల వద్ద రూ.50 లక్షలు- రూ.2 కోట్ల మధ్య ఆస్తులు ఉన్నాయి. 436 మంది అభ్యర్థులు తమకు రూ.10-రూ.50 లక్షల విలువ చేసే ఆస్తి ఉందని ప్రకటించారు. 573 మంది రూ.10 లక్షల కంటే తక్కువ ఆస్తి ఉందని వెల్లడించారు. అయితే ఆర్జేడీ ప్రకటించిన జాబితాలో అందరూ కోటీశ్వరులే ఉన్నారు. అన్నాడీఎంకే అభ్యర్థుల్లో 97 శాతం మంది కోటీశ్వరులు ఉండగా, డీఎంకే అభ్యర్థుల్లో 96 శాతం మంది, భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్లో 90 శాతం మంది, కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో 88 శాతం మంది, తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో 21 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు.

విద్యార్హతలు!
మొత్తం 1618 మందిలో 28 మంది నిరక్షరాస్యులు, 255 మంది గ్రాడ్యుయేట్లు, 309 పోస్ట్​ గ్రాడ్యుయేట్​లు, 47 మంది డాక్టరేట్లు ఉన్నారు. 466 మంది అభ్యర్థులు 41-50 మధ్య వయస్సు ఉన్న వారు కాగా 388 మంది 31-40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు. 51-60 వయసు మధ్య 383 మంది, 61-70 ఏళ్ల మధ్య 117 మంది, 25-30 వయసు మధ్య 210 మంది అభ్యర్థులు ఉన్నారు. 71-80 ఏళ్ల మధ్య 50 మంది అభ్యర్థులు ఉండగా 81 నుంచి 90 ఏళ్ల మధ్య నలుగురు ఉన్నారు.