Skip to main content
Source
Sakshi
https://www.sakshi.com/telugu-news/national/adr-report-1400-crore-assets-dk-shivakumar-india-richest-mla-1702326
Date
City
Bengaluru

దేశంలోనే అత్యంత ధనిక, పేద ఎమ్మెల్యేల జాబితాను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్.. టాప్‌ ప్లేస్‌లో నిలిచారు. రూ. 1,400 కోట్లకు పైగా ఆస్తులతో.. దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా నిలిచారాయన.

2023లో కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆఫిఢవిట్లలోని వివరాల ప్రకారం అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌).. దేశంలో ధనిక, పేద ఎమ్మెల్యేల లిస్ట్‌ విడుదల చేసింది.

ఈ జాబితాలో రూ. 1,400 కోట్ల ఆస్తులతో డీకే శివకుమార్‌ అత్యంత ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు. తరువాత రూ. 1,267 కోట్ల విలువైన ఆస్తులతో కర్ణాటకకే చెందిన గౌరిబిదనూర్‌ ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే కేహెచ్‌ పుట్టస్వామి గౌడ రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో కాంగ్రెస్‌కు చెందిన ప్రియ కృష్ణ రూ. 1,156 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. ఇక తొలి 10 మంది ధనిక ఎమ్మెల్యేల్లో నలుగురు కాంగ్రెస్‌కు చెందిన వారు కాగా, ముగ్గురు బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు.

తన ఆస్తుల గురించి శివకుమార్‌ను ప్రశ్నించగా.. తాను ధనికుడిని కాదని, అలాగని పేదవాడిని కూడా కాదని అన్నారు.  ప్రస్తుతం తనకున్న ఆస్తులన్నీ సుదీర్ఘకాలం కష్టపడి సంపాదించుకున్నవని పేర్కొన్నారు. తన ఆస్తులన్నీ తన పేరు మీదే ఉన్నాయని, అందుకే తన పేరిట ఇన్ని ఆస్తులు ఉన్నట్లు వివరణ ఇచ్చారు. వ్యాఖ్యానించారు. కొందరు తమ ఆస్తులను వివిధ వ్యక్తుల పేరిట రాసుకుంటారని, తనకి అలా ఇష్టం ఉండదని చెప్పారు. అందుకే తన పేరిట ఇన్ని ఆస్తులు ఉన్నట్లు చెప్పారు.

ఇక అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమబెంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్‌ కుమార్‌ ధారా ఉన్నారు. తన పేరు మీద  కేవలం రూ. 1,700  ఆస్తులే ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇతని తరువాత ఒడిశాకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే మకరంద ముదులి రూ. 15,000 వేల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. 

మరోవైపు దేశ వ్యాప్తంగా తొలి 20 మంది సంపన్న ఎమ్మెల్యేల్లో 12 మంది కర్ణాటకకు చెందిన వారే ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది. అంతేగాక రాష్ట్రంలో 14 శాతం మంది ఎమ్మెల్యేలు బిలియనీర్లు కాగా వారు  రూ.100 కోట్లకు పైగా  వ్యక్తిగత ఆస్తులు కలిగి ఉన్నట్లు పేర్కొంది.  ఆ తర్వాతి స్థానంలో అరుణాచల్‌ ప్రదేశ్‌ ఉంది. ఆ రాష్ట్రంలోని మొత్తం 59 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు కోటీశ్వరులు ఉన్నారు.


abc