Source: 
Eenadu
https://www.eenadu.net/telugu-news/politics/72-per-cent-of-bihar-ministers-face-criminal-cases-says-adr/0500/122157477
Author: 
Date: 
18.08.2022
City: 
Patna

బిహార్‌లో ఇటీవల కొలువుదీరిన నీతీశ్‌ కుమార్‌ కొత్త మంత్రివర్గంలో 27మంది కోటీశ్వరులు కాగా.. 70శాతం మందికి పైగా క్రిమినల్‌ కేసులు ఉన్నాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR) నివేదిక వెల్లడించింది. సీఎం నీతీశ్‌, డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్‌లకు వ్యతిరేకంగానూ కేసులు ఉన్నట్టు పేర్కొంది. ఇటీవల భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీ(యు) అధినేత నీతీశ్‌ కుమార్‌ ఆర్జేడీతో చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని నెలకొల్పిన విషయం తెలిసిందే. ఆగస్టు 10న నీతీశ్‌ సీఎంగా, తేజస్వీ యాదవ్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా.. నిన్న చేపట్టిన కేబినెట్‌ విస్తరణలో భాగంగా  31మందిని కొత్తగా కేబినెట్‌లోకి తీసుకున్నారు. అయితే, వీరంతా 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించిన ఏడీఆర్‌, బిహార్‌ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థలు నివేదికను రూపొందించి విడుదల చేశాయి. సీఎం నీతీశ్‌తో పాటు మొత్తం 33మందితో కేబినెట్‌ ఉండగా.. 32మంది అఫిడవిట్లను పరిశీలించినట్టు ఏడీఆర్‌ తెలిపింది. ఎమ్మెల్సీ కోటా నుంచి అశోక్‌ చౌదరిని కేబినెట్‌లోకి తీసుకోవడంతో ఆయన అఫిడవిట్‌ సమర్పించాల్సిన అవసరం లేనందున ఆయనకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవని నివేదికలో తెలిపింది.

ఏడీఆర్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం నీతీశ్ కేబినెట్‌లో 23మంది మంత్రుల(72శాతం)పై క్రిమినల్‌ కేసులు ఉండగా.. వీరిలో 17 మంది (53శాతం)పై తీవ్రమైన నేరారోపణలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. అలాగే, 32మంది మంత్రుల్లో 27 మంది (84శాతం) కోటేశ్వరులేనని, వారి సగటు ఆస్తుల రూ.5.82కోట్లుగా ఉంది. మధుబాని నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సమీర్‌ కుమార్‌ మహాసేథ్‌ తన ఆస్తులు అత్యధికంగా రూ.24.45కోట్లు అని పేర్కొనగా.. చెనారి నియోజకవర్గం (ఎస్సీ) నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మురారి ప్రసాద్‌ గౌతమ్‌ రూ.17.66లక్షలుగా ఉంది. ఎనిమిది మంది 8 నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నవారు కాగా.. 24 మంది గ్రాడ్యుయేషన్‌ ఆపై చదువులు అభ్యసించారు. నీతీశ్‌ కేబినెట్‌లో 17మంది 30-50 ఏళ్ల వయస్కులు కాగా.. మిగతా 15మంది వయస్సు 51-71 ఏళ్లుగా ఉంది. నీతీశ్‌ మంత్రివర్గంలో 11 మంది జేడీయూకి చెందినవారు ఉండగా.. 16మంది ఆర్జేడీ, ఇద్దరు కాంగ్రెస్‌, ఒకరు హిందుస్థానీ అవామ్‌ మోర్చా నుంచి ఒకరు, స్వతంత్రులు ఒకరు ఉన్నారు. మంత్రివర్గంలో ముగ్గురు మహిళలు ఉన్నారు. 

© Association for Democratic Reforms
Privacy And Terms Of Use
Donation Payment Method