2021-22లో బీజేపీకి విరాళాల రూపంలో రూ.614.63 కోట్లు అందాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) తాజా నివేదిక వెల్లడించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: 2021-22లో బీజేపీకి విరాళాల రూపంలో రూ.614.63 కోట్లు అందాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) తాజా నివేదిక వెల్లడించింది. కాంగ్రెస్‌కు రూ.95.46 కోట్లు వచ్చాయని తెలిపింది. బీజేపీకి వచ్చిన విరాళాల్లో భారీగా కార్పొరేట్/వ్యాపార వర్గాల నుంచే రూ.548.81 కోట్లు(దాదాపు 90 శాతం) అందాయని ఏడీఆర్ పేర్కొన్నది. ఇతర జాతీయ పార్టీలకు వచ్చిన కార్పొరేట్ విరాళాల(రూ.77.08 కోట్లు) కంటే బీజేపీకి ఏడు రెట్లు అధికంగా వచ్చాయి.
కాంగ్రెస్‌కు కార్పొరేట్ విరాళాలు రూ.54.57 కోట్లు(మొత్తంలో 57%) వచ్చాయి. మొత్తంగా 2021-22 కాలానికి కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్, ఎన్‌పీఈపీ ప్రకటించిన విరాళాల కంటే బీజేపీకి మూడు రెట్లు అధికంగా రావడం గమనార్హం. 2021-22కు సంబంధించి జాతీయ పార్టీల ప్రకటనల ప్రకారం.. మొత్తంగా రూ.780.77 కోట్ల విరాళాలు వచ్చాయి.