దేశవ్యాప్తంగా 107 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై విద్వేషపూరిత ప్రసంగాల కేసులు ఉన్నాయని, అలాంటి కేసులున్న 408 మంది అభ్యర్థులు గత అయిదేళ్లలో ఎన్నికల్లో పోటీ చేశారని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)’ తెలిపింది.
దేశవ్యాప్తంగా 107 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై విద్వేషపూరిత ప్రసంగాల కేసులు ఉన్నాయని, అలాంటి కేసులున్న 408 మంది అభ్యర్థులు గత అయిదేళ్లలో ఎన్నికల్లో పోటీ చేశారని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)’ తెలిపింది. ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) గత అయిదేళ్లలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన, ఓడిపోయిన ఎంపీలు, ఎమ్మెల్యేల స్వీయ ప్రమాణపత్రాలను విశ్లేషించాయి. మొత్తం 33 మంది ఎంపీలు వారిపై ఉన్న విద్వేషపూరిత కేసులను ప్రకటించారు. ఇందులో ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఏడుగురు, తమిళనాడు నుంచి నలుగురు, బిహార్, కర్ణాటక, తెలంగాణల నుంచి ముగ్గురు చొప్పున, అస్సాం, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ల నుంచి ఇద్దరు చొప్పున, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, కేరళ, ఒడిశా, పంజాబ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరిలో 22 మంది భాజపా ఎంపీలు. ఇద్దరు కాంగ్రెస్‌కు చెందినవారు. ఆప్, ఎంఐఎం, ఏఐయూడీఎఫ్, డీఎంకే, ఎండీఎంకే, పీఎంకే, శివసేన (యూబీటీ) నుంచి ఒకరు చొప్పున ఉన్నారు. ఎమ్మెల్యేల్లో 74 మంది తమపై ఉన్న విద్వేషపూరిత ప్రసంగాల కేసులను ప్రకటించుకున్నారు. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌ల నుంచి తొమ్మిది మంది చొప్పున, ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ఆరుగురు చొప్పున, అస్సాం, తమిళనాడు నుంచి అయిదుగురు చొప్పున, దిల్లీ, గుజరాత్, బెంగాల్ నుంచి నలుగురు చొప్పున, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్ నుంచి ముగ్గురు చొప్పున, కర్ణాటక, పంజాబ్ నుంచి ఇద్దరు చొప్పున, రాజస్థాన్, త్రిపుర, మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి ఒకరు చొప్పున ఉన్నారు. ఇందులో భాజపా నుంచి 20, కాంగ్రెస్ 13, ఆప్ 6, ఎస్పీ 5, వైకాపా 5, డీఎంకే 4, ఆర్జేడీ 4, ఏఐటీసీ 3, ఎస్‌హెచ్‌ఎస్ 3, ఏఐయూడీఎఫ్, ఏఐఎంఐఎం, సీపీఐ(ఎం), ఎన్సీపీ, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, తెదేపా, తిప్ర మోతా పార్టీ, భారాస నుంచి ఒకరు చొప్పున ఉన్నారు. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.