Skip to main content
Source
ETV Bharat Telugu
https://www.etvbharat.com/telugu/telangana/bharat/adr-report-on-mps-criminal-cases-40-pc-sitting-mps-have-criminal-cases-25-pc-serious-criminal-cases-adr/na20230913073714913913620
Author
PTI
Date

ADR Report On MPS Criminal Cases : దేశంలోని సిట్టింగ్​ ఎంపీల్లో 40 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది. వీరిలో 25 శాతం మందిపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయి.

ADR Report On MPS Criminal Cases : పార్లమెంట్‌ ఉభయ సభల్లో సిట్టింగ్‌ ఎంపీలపై 40 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ఏడీఆర్‌ సంస్థ నివేదికలో వెల్లడైంది. అందులో 25 శాతం మందిపై హత్య, కిడ్నాప్‌, హత్యాయత్నం, మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులు వంటివి ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థతో కలిసి సిట్టింగ్‌ ఎంపీల అఫిడవిట్‌లను పరిశీలించి ఈ వివరాలను వెల్లడించింది ఏడీఆర్​. ఉభయ సభల్లో కలిపి మొత్తం 776 ఎంపీలకు గానూ 763 మంది ఎంపీలు.. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి నివేదికను రూపొందించింది. కొన్ని స్థానాలు ఖాళీగా ఉండడం, అఫిడవిట్లు అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల కొన్నింటిని పక్కనపెట్టింది.

ADR Report On MPS In Telangana : మొత్తం 763 మంది సిట్టింగ్‌ ఎంపీల్లో 306 మంది (40 శాతం) మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ఏడీఆర్‌ వెల్లడించింది. అందులో 194 మంది (25 శాతం)పై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయని చెప్పింది. తెలంగాణలోని 24 మంది ఎంపీల్లో 13 మందిపై క్రిమినల్‌ కేసులు ఉండగా.. అందులో 9 మందిపై తీవ్రమైన నేరాలు ఉన్నట్లు ఏడీఆర్‌ పేర్కొంది. పార్టీల వారీగా చూస్తే వైసీపీకి చెందిన 31 ఎంపీల్లో 13 మందిపై క్రిమినల్‌ కేసులు ఉండగా.. అందులో 11 మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ఏడీఆర్‌ చెప్పింది. బీజేపీలోని 385 మంది ఎంపీల్లో 139 మందిపై క్రిమినల్‌ కేసులు, 98 మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు.. కాంగ్రెస్‌లో 81 మందిలో 43 మందిపై క్రిమినల్‌ కేసులు, 26 మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

ADR Report On Political Party Richest : ఇక ఎంపీల ఆస్తుల విషయానికొస్తే.. అత్యధికంగా తెలంగాణ ఎంపీల (24మంది) సగటు ఆస్తి రూ.262.26 కోట్లుగా ఉందని ఏడీఆర్​ వెల్లడించింది. ఆ తర్వాతి స్థానంలో (36 మంది) ఏపీ ఎంపీల సగటు ఆస్తి రూ.150.76 కోట్లుగా ఉంది. పార్టీల వారీగా చూస్తే.. బీజేపీ ఎంపీల సగటు ఆస్తి 18.31 కోట్లు.. కాంగ్రెస్‌ ఎంపీల సగటు ఆస్తి రూ.39.12 కోట్లుగా ఉందని ఏడీఆర్‌ తెలిపింది. వైసీపీ ఎంపీల సగటు ఆస్తి రూ.153.76 కోట్లు.. భారాస ఎంపీల సగటు ఆస్తి రూ.383.51 కోట్లుగా చెప్పింది. ఏపీ నుంచి 9 మంది, తెలంగాణ ఎంపీల్లో ఏడుగురు బిలియనీర్లు ఉన్నారని ఏడీఆర్‌ తెలిపింది. వైసీపీ ఎంపీల మొత్తం ఆస్తి రూ.4,766 కోట్లు, భారాస ఎంపీల మొత్తం ఆస్తి రూ.6,163 కోట్లుగా ఏడీఆర్‌ వివరించింది. 763 ఎంపీల మొత్తం ఆస్తుల విలువ రూ.29,251 కోట్లుగా ఏడీఆర్‌ లెక్కగట్టింది.


abc