Criminal Cases On Newly Eleccted MPs : లోక్‌సభకు కొత్త ఎన్నికైన 543 మంది ఎంపీల్లో 105 మంది చదువుకున్నది 5 నుంచి 12 వరకే. మొత్తం ఎన్నికైన ఎంపీల్లో 251మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారిలో 27 మంది కొన్ని కేసుల్లో దోషులుగా తేలినవారు కూడా ఉన్నారు. నూతనంగా ఎంపికైన వారు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌ల విశ్లేషణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
Criminal Cases On Newly Elected MPs : లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన 543మంది విద్య, వారిపై నమోదైన కేసులపై అసోషియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్-ADR ఆసక్తికరమైన వివరాలను వెల్లడించింది. ఎన్నికల్లో పోటీ చేసిన అందరి ఎన్నికల అఫిడవిట్‌లను పరిశీలించిన ADR గెలిచిన వారి నేపథ్యాలతో కూడిన వివరాలను వెల్లడించింది. లోక్‌సభకు ఎన్నికైన వారిలో 251మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ADR తెలిపింది. అంటే దాదాపు 46శాతం మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వారిలో 27మంది దోషులుగా తేలారని పేర్కొంది. పార్లమెంటు దిగువ సభ సభ్యుల్లో క్రిమినల్ కేసులు ఎదుర్కోవడం ఇప్పుడే ఎక్కువని ADR వెల్లడించింది.
అయితే 2019లో ఎన్నికైన లోక్‌సభ ఎంపీల్లో 43 శాతం అంటే 233 మంది తమపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ ప్రకటించింది. 2014లో 34 శాతం అంటే 185 మంది క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. 2009లో ఈ సంఖ్య 162గా ఉండగా 2004లో 125గా మాత్రమే ఉంది. 2009 నుంచి ఇప్పటివరకూ క్రిమినల్ కేసులు నమోదైన ఎంపీల సంఖ్య 55శాతం పెరిగినట్లు ADR విశ్లేషణలో తేలింది. ఈ ఏడాది 251 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదుకాగా వారిలో 170 మందిపై అత్యాచారం, హత్య, హత్యాయత్నం, అపహరణ, మహిళలపై నేరాలకు పాల్పడినట్లు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదైన ఎంపీల సంఖ్య కూడా ఈసారే ఎక్కువ.
దోషులుగా తేలిన 27మంది
2019లో 159 మంది, 2014లో 112మంది, 2009లో 76 మంది ఎంపీలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు ADR తెలిపింది. 27 మంది ఎంపీలు దోషులుగా తేలగా వారిలో నలుగురు హత్యాభియోగాలతో దోషులుగా తేలారు. మొత్తం 27 మంది హత్యాయత్నం కేసుల్లో దోషులుగా తేలినట్లు ADR వివరించింది. మహిళలపై నేరాలకు పాల్పడినట్లు 15 మంది కొత్త ఎంపీలపై కేసులు నమోదయ్యాయి. వారిలో ఇద్దరిపై అత్యాచారం ఆరోపణల కేసులు ఉన్నాయి. నలుగురు ఎంపీలపై అపహరణ, 43 మందిపై విద్వేష ప్రసంగం కేసులు నమోదైనట్లు ADR పేర్కొంది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో క్రిమినల్ కేసులు నమోదైన అభ్యర్థుల్లో విజయం శాతం 15.3గా ఉంది. అదే ఎలాంటి మచ్చలేనివారు 4.4శాతంగా మాత్రమే ఎన్నికల్లో విజయం సాధించినట్లు ADR విశ్లేషణలో వెల్లడైంది. 240 మంది ఎంపీలతో లోక్‌సభలో ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. బీజేపీ ఎంపీల్లో 94శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 99మంది కాంగ్రెస్ ఎంపీల్లో 49శాతం మందిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 37మంది ఎంపీల్లో 21మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఎన్నికల అఫిడవిట్‌లో వారు ప్రకటించారు. 29మంది తృణమూల్ ఎంపీల్లో 13 మంది, 22మంది డీఎంకే ఎంపీల్లో 13మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
105మందికి ఇంటర్ విద్యార్హత
బీజేపీ ఎంపీల్లో 63 మంది, కాంగ్రెస్ ఎంపీల్లో 32మంది, సమాజ్‌వాదీ ఎంపీల్లో 17 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. లోక్‌సభకు కొత్త ఎన్నికైన వారిలో 105 మంది ఐదు నుంచి 12వ తరగతి వరకూ చదువుకున్నట్లు ప్రకటించారు. దిగువ సభకు ఎన్నికైన 420 మంది డిగ్రీ అంతకంటే ఎక్కువ చదివినట్లు తెలిపారని ADR వివరించింది. 17 మంది విజేతలు డిప్లోమా చేయగా ఒకరు అక్షరాస్యుడిగా పేర్కొన్నారు. ఆసక్తికరంగా ఏమీ చదవుకోలేదని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న మొత్తం 121 మంది అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైనట్లు ADR విశ్లేషణలో వెల్లడైంది.