Source: 
TV9 Telugu
https://tv9telugu.com/politics/66-of-income-of-7-national-parties-in-2021-22-came-from-electoral-bonds-other-unknown-sources-says-adr-au24-908538.html
Author: 
Anil kumar poka
Date: 
12.03.2023
City: 

భాజపా, కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎమ్, నేషనల్ పీపుల్స్ పార్టీలకు దాదాపు 2 వేల 172 కోట్లు అందినట్లు గుర్తించింది. ఈ సొమ్ము అంతా ఎలక్టోరల్ బాండ్స్, కూపన్లు విక్రయించడం..

రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కొంతవరకు నిధులు వస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే 2021-22 లో 7 జాతీయ పార్టీలలకు వాటి మొత్తం ఆదాయంలో 66 శాతానికి పైగా ఎలక్టోరల్ బాండ్స్ లాంటి గుర్తితెలియని వర్గాల నుంచే వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డిమోక్రాటిక్ రిఫార్మ్స్ ( ADR) వెల్లడించింది. భాజపా, కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎమ్, నేషనల్ పీపుల్స్ పార్టీలకు దాదాపు 2 వేల 172 కోట్లు అందినట్లు గుర్తించింది. ఈ సొమ్ము అంతా ఎలక్టోరల్ బాండ్స్, కూపన్లు విక్రయించడం, ఉపశమన నిధులు, స్వచ్ఛంద విరాళాలు వంటి వాటి నుంచి వచ్చినట్లు పేర్కొంది.ప్రస్తుతానికి 20 వేల కంటే తక్కువగా నిధులు ఇచ్చేవారు, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలిచ్చే వారి పేర్లు, సంస్థల పేర్లు రాజకీయ పార్టీలు చెప్పాల్సిన అవసరం లేదు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భాజపా తమ ఆదాయంలో దాదాపు రూ.1,161 కోట్లు గుర్తుతెలియని వర్గాల నుంచి వచ్చినట్లు ప్రకటించింది. ఇతర ఆరు జాతీయ పార్టీలు రూ.1,011 కోట్లు రాబట్టుకోగా, ఒక్క భాజపాకు రూ.1,161 కోట్లు నిధులు వచ్చాయి. అంటే ఇతర పార్టీల మొత్తం ఆదాయం కంటే భాజపాకు రూ.149.86 కోట్లు అధికంగా వచ్చాయి.2004-05, 2021-22 మధ్యకాలంలో జాతీయ పార్టీలు వివిధ వర్గాల నుంచి దాదాపు రూ.17 వేల 249 కోట్లు రాబట్టుకున్నట్లు A.D.R తెలిపింది. 2004-05, 2021-22 మధ్యకాలంలో కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలకు కూపన్లు విక్రయించడం ద్వారా రూ.4 వేల 398 కోట్లు వచ్చినట్లు పేర్కొంది.

2021-22 ఆర్థిక సంవత్సరానికి టీఎంసీకి విరాళాల రూపంలో 38 లక్షలు వచ్చినట్లు ఆడిట్ నివేదిక తెలిపింది. కానీ తమకు 43 లక్షలు విరాళాలు వచ్చినట్లు టీఎంసీ ప్రకటించింది. సభ్యత్వం ఫీజులు, పార్టీ నిధులు, ఎన్నికల నిధుల ద్వారా తమకు విరాళాలు వచ్చినట్లు సీపీఐ తెలిపింది. మరోవైపు తమకు గుర్తితెలియని వర్గాల నుంచి లేదా స్వచ్ఛంద విరాళాల నుంచి ఎటువంటి నిధులు అందలేవని బీఎస్పీ పేర్కొంది.

© Association for Democratic Reforms
Privacy And Terms Of Use
Donation Payment Method