Richest MLA | కర్ణాటక డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్.. దేశంలోకెల్లా అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా నిలిచారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) అధ్యయనంలో తేలింది.
Richest MLA | ప్రతి ఒక్కరూ తమ రాజకీయ నాయకులు ఆస్తులు, వాటి విలువ ఎంత అన్నది తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. గతంతో పోలిస్తే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పేదవాడైనా.. తర్వాతర్వాత రూ.కోట్లకు పడగలెత్తిన నేతలు ఎందరెందరో ఉన్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల సందర్భంగా దేశంలోనే అత్యంత సంపన్నుడిగా కర్ణాటక డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ అని తేలింది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోటీ చేసిన అభ్యర్థుల అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) అధ్యయనం చేసిన తర్వాత దేశంలోనే అత్యంత సంపన్నుడైన ఎమ్మెల్యే, అత్యంత పేదవాడైన ఎమ్మెల్యే ఎవరో నిగ్గు తేల్చింది.
అత్యంత సంపన్నుడిగా నిలిచిన డీకే శివకుమార్ ఆస్తులు రూ.1,400 కోట్లు. ఇందులో ఆయన స్థిరాస్థులు రూ.273 కోట్లు, చరాస్తులు రూ.1140 కోట్లు కాగా, అప్పులు రూ.265 కోట్లు ఉన్నాయి. అత్యంత పేదవాడిగా ఉన్న ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా.. ఆయన పశ్చిమ బెంగాల్ ఎంఎల్ఏ. ఆయన ఆస్తి కేవలం రూ.1700 మాత్రమే.
తొలి పది మంది సంపన్న ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ వారు నలుగురు ఉంటే, ముగ్గురు బీజేపీ వారు. ఇక దేశంలోని 20 మంది సంపన్న ఎమ్మెల్యేల్లో 12 మంది కాంగ్రెస్ వారేనని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. దీనిపై స్పందించిన బీజేపీ.. సంపన్నులకు మాత్రమే కాంగ్రెస్ న్యాయం చేస్తుందని విమర్శలు గుప్పించింది. పార్టీలోనూ సంపన్నులకే స్థానం కేటాయిస్తుందని పేర్కొంది. కర్ణాటక ఎమ్మెల్యేల్లో 14 శాతం మంది సంపన్నులేనని, వారి వ్యక్తిగత ఆస్తులు రూ. కోట్ల పై మాటేనని నివేదిక వ్యాఖ్యానించింది.
దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేనన్న నివేదికపై డీకే శివ కుమార్ రియాక్టయ్యారు. తాను సంపన్నుడినీ కాదు.. పేదవాడినీ కాదన్నారు. ఇప్పుడు ఉన్న ఆస్తులన్నీ ఒక్కసారిగా వచ్చి పడినవి కావని, సుదీర్ఘకాలం కష్టపడి సంపాదించుకున్నవన్నారు.
డీకే శివ కుమార్ తర్వాత స్థానంలో రూ.1267 కోట్ల ఆస్తులతో గౌరిబిదనూర్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కేహెచ్ పుట్టస్వామి నిలిచారు. మూడో స్థానంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాకృష్ణ, కర్ణాటక ఎమ్మెల్యేల్లో తక్కువ ఆస్తులు గల బీజేపీ ఎమ్మెల్యే భాగీరథి మురుల్య.. ఆయనకు రూ.28 లక్షల ఆస్తులు, రూ.2 లక్షల అప్పులు ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న పుట్టస్వామి కూతురే కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాకృష్ణ కావడం గమనార్హం.