Skip to main content
Source
Sakshi
https://www.sakshi.com/telugu-news/national/lok-sabha-elections-2024-adr-reveals-low-female-representation-and-high
Date

తొలి రెండు విడతల్లో మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల మూడో విడతలోనూ మహిళలకు సముచిత స్థానం దక్కలేదు. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్‌సభ స్థానాలకు మే 7న పోలింగ్‌ జరగనుంది. 1,352 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో మహిళలు 123 మందే (9 శాతం) ఉన్నారు. ఇక ప్రతి పది మంది అభ్యర్థుల్లో ఇద్దరు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నట్టు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫారమ్స్‌ (ఏడీఆర్‌) డేటా వెల్లడించింది.

వీరిలో13 శాతం మందిపై మహిళలపై అత్యాచారం వంటి తీవ్ర కేసులున్నాయి. మొత్తం 38 మంది అభ్యర్థులు మహిళలకు సంబంధించిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శివసేన (ఉద్ధశ్‌) అభ్యర్థుల్లో ఏకంగా 80 శాతం, ఎన్సీపీ (శరద్‌ పవార్‌) అభ్యర్థుల్లో 67 శాతం, ఎస్పీ అభ్యర్థుల్లో 50 శాతం, జేడీ(యూ)లో 33 శాతం, తృణమూల్‌ కాంగ్రెస్‌లో మందిపై క్రిమినల్‌ కేసులుండటం విశేషం! బీజేపీ నుంచి 22 మంది, కాంగ్రెస్‌ నుంచి 26, ఆర్జేడీ నుంచి ముగ్గురిపై కేసులున్నాయి. అభ్యర్థుల్లో ముగ్గురు, అంతకంటే ఎక్కువ మందిపై క్రిమినల్‌ కేసులున్నప్పుడు ప్రకటించే రెడ్‌ అలర్ట్‌ను 43 నియోజకవర్గాల్లో జారీ చేశారు.

మూడో వంతు కోటీశ్వరులే

మొత్తం అభ్యర్థుల్లో 392 మంది కోటీశ్వరులేనని వారు దాఖలు చేసిన అఫిడవిట్లు తెలియజేస్తున్నాయి. దక్షిణ గోవా బీజేపీ అభ్యర్థి పల్లవీ శ్రీనివాస్‌ డెంపో రూ.1,361 కోట్ల ఆస్తులతో టాప్‌లో ఉన్నారు. తర్వాత మధ్యప్రదేశ్‌ గుణ బీజేపీ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియా రూ.424 కోట్లు, మహారాష్ట్రలో కొల్హాపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఛత్రపతి సాహు మహారాజ్‌ రూ.342 కోట్లతో రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. మూడో దశలో 82 మంది బీజేపీ అభ్యర్థుల్లో 77 మంది; 68 మంది కాంగ్రెస్‌ అభ్యర్థుల్లోనూ ఏకంగా 60 మంది కోటీశ్వరులే. జేడీ(యూ), శివసేన (ఉద్ధవ్‌), ఎన్సీపీ, ఆర్జేడీ, శివసేన, ఎన్సీపీ (శరద్‌ పవార్‌) అభ్యర్థులంతా కోటీశ్వరులే. ఐదుగురు అభ్యర్థులు తమకెలాంటి ఆస్తులూ లేవని పేర్కొనడం విశేషం.

సగం మంది ఇంటర్‌ లోపే

అభ్యర్థుల్లో 639 మంది విద్యార్హత ఆరో తరగతి నుంచి ఇంటర్‌ లోపే! 19 మందైతే ఏమీ చదువుకోలేదు. 56 మంది ఐదో తరగతి లోపే చదివారు. 591 మందికి డిగ్రీ, అంతకంటే ఉన్నత విద్యార్హతలు ఉన్నాయి. 44 మంది డిప్లొమా చేశారు.


abc